ఒక నువ్వు ఒక నేను
అంశం: ఒకనువ్వు ఒక నేను
శీర్షిక: అంపశయ్య
ఆకాశపు పందిరి లో
ఎర్రటి పారాణి తో..
బ్రహ్మముడుల బంధంతో
బాజా భజంత్రీల మధ్య
పీటల పై ఒదిగి పోయి..
తలలువంచి కళ్ళు తెరిచి
మౌనంగా పలకరించుకుంటూ
ఒక నువ్వు ఒక నేను!
అలసిన మనసుల కొక
ఆటవిడుపు కోసమైనా
సేదదీరి శయ్యపై న
ఊసులాడుకొందామని
ఎదురు చూపు చూస్తుంటే
చిన్నారుల సేవలతో
నీ రెండు కళ్లు వాలిపోగా
బాధ్యతల బరువులతో
నా శిరసు మొద్దుబారిపోగా
కలల్లో న విరిశయ్య పై
వెచ్చని కౌగిట ఒదిగిన
ఒక నువ్వు ఒక నేను..
పడమటి మలి సంధ్య వేళ
దూర దూర తీరాల మధ్య
పెరుగుతున్న అంకురాలతో ..
ఫోను భాష ముగించి నీవు..
ఒంటరి తనపు స్నేహితునితో
కబుర్లాడిన నేను..
అంపశయ్య మీద దొర్లి
నిద్రలోకి జారుకొనగా, కలలో
రెండు కరుగుతున్న కొవ్వత్తులు..
ఒకనువ్వు ఒక
నేను..
రచన: శ్రీనివాస శాస్త్రి.
Comments
Post a Comment