ఉగాది ప్రసాదం

 కథ: ఉగాది 

“నాన్నా పూజ అయిపోయింది, ఉగాది ప్రసాదం తీసుకోండి” అని ఉగాది పచ్చడి అందించింది సుమతి..

రంగనాథం గారి కళ్ళు చెమర్చాయి.

“ఊరుకో నాన్నా బాధపడకు. నువ్వు బాధ పడితే మేముకుడా అధైర్య పడతాము”అన్నది సుమతి.

“అబ్బే బాధ పడడం లేదమ్మా!పోయిన ఉగాదికి అమ్మ చేతి ప్రసాదం తిన్నాను. ఈ ఉగాదికి ఆమె మనతో లేదు.

ఇప్పుడు నీవు పూజ చేసుకుని ఉగాది ప్రసాదం ఇస్తుంటే నీలో మీ అమ్మ కనపడింది. అందుకని ఆనంద బాష్పాలు వచ్చాయి అంతే” అని ప్రసాదం తీసుకున్నారు రంగనాథం గారు.

“నాన్నా!యుఎస్ నుండి అన్నయ్య నిన్న ఫోన్ చేశాడు. అమ్మలేకుండా నిన్ను ఆ పల్లెటూర్లో చూసుకునేది ఎవరు? అందుకని గుంటూరు కి దగ్గరలో ఒక లక్సరీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో నీకు వసతి ఏర్పాటు చేశాడట. అన్నీ సౌకర్యాలూ ఉంటాయి. మరి నీవేమో ఇక్కడే హైదరాబాద్ లో నాదగ్గరకు వచ్చి ఉండమంటే ఒప్పుకోవడం లేదాయే. ఇంక ఇంత కంటే ఏమి చేయాలో మా ఇద్దరికీ పాలుపోలేదు” అంది సుమతి. 

“సరే నమ్మా ఒక్కసారి నన్ను ఊరిలోని మన ఇంటికి తీసుకెళ్ళండి. అమ్మ ఫోటో, ఇంకా కొన్ని ఆమె వస్తువులు గుర్తుగా ఉంచుకున్నా. వాటిని తీసుకుని వసతి గృహం లోకి ఒక వారం లో షిఫ్ట్ అవుతాను” అన్నారు రంగ నాథం గారు. ఎంత కష్టమొచ్చినా ఆడపిల్ల ఇంట్లో ఉండకూడదు అనే ఒక పట్టుదలలో ఆయన ఉన్నాడు.

ఒక వారం రోజుల తరువాత కార్ లో బయలు దేరి వారి ఊర్లోని స్వంత ఇంటికి వెళ్లారు. ఎదురుగా గోడకి ఉన్న ఆయన భార్య ఫోటోని జాగ్రత్త గా దించి తన బ్యాగ్ లో పెట్టుకున్నాడు రంగనాధం గారు. ఇల్లు మొత్తం ఒకసారి కలియ తిరిగి చూసుకొన్నాడు. పెరట్లో పసుపు రంగు తో మెరుస్తున్న తులసి కోట ఎంతో కళగా కనిపించింది..తన భార్య అలా ఈ తులసి మొక్కలో ఉండి తనను పలకరిస్తున్నట్టుఅనిపించింది.

బయట విరబూసి కాపు కి వచ్చిన మామిడి చెట్టు కాన్పుకు పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల “నాన్నా నా సంగతేమిటి “ అని అడుగుతున్నట్టు గా అనిపించింది. బయట వాకిలి పక్క అటు ఇటు ఉన్న రెండు అరుగులు “మిత్రమా! మళ్ళీ ఎప్పుడుకలుస్తామో మరి సెలవ్” అంటున్నాయి. మీతో ఇక ఋణం తీరి పోయింది అనుకుంటూ

బరువెక్కిన హృదయం తో“సరే ఇంక వెళ్దామా అమ్మా” అన్నాడు కూతురుతో.

ఈలోగా బయట ఇంకొక కారు ఆగింది.

కారు లోనుండి మహేష్ దిగు తున్నాడు. అదేంటి మొన్న ఫోన్ చేసినప్పుడు, “నాన్నను ఓల్టేజ్ హోమ్ లో దింపడానికి తను కూడా వస్తాను అని అన్నయ్య చెప్పలేదే” అనుకుని తనకు ఎదురు వెళ్ళింది సుమతి..

“చెల్లాయ్ నాన్న లగేజీ ఇంట్లో నే ఉండనీయి. నాన్న ఎక్కడికీ వెళ్ళడు . నేనే ఇక్కడికి వచ్చి ఉంటున్నా.

అమ్మ లేకుండా ఒక్కడే ఉంటూ ఇంత గా కుంగి పోయిన మనిషిని ఆయన పుట్టి పెరిగిన ఇంటికీ, ఊరికీ కూడా దూరం చేస్తే ఆ దిగులుతో ఆయన గుండె అస్సలు తట్టు కోలేదు. అనుకోకుండా అమ్మని కోల్పోయిన మనం నాన్నకు కూడా అలా ఏదన్నా జరిగితే? అనే ఆలోచన తో ఒక్కసారిగా నాకు భయం వేసింది.

నేను యూఎస్ లో అగ్రికల్చర్ రోబోటిక్ మెషినరీ కంపెనీ లోనే కదా ఇంజనీర్ గా పని చేస్తున్నా. మన ఊర్లో మనకున్న పది ఎకరాల పొలం నాన్న పట్టుదలతో స్వంతంగా సాగు చేసి మనలను ఇంతవాళ్లను చేశాడు..

ఇప్పుడు నేను నా సాంకేతిక ఙ్ఞానం తో కొత్త కొత్త పద్ధతులతో ఇంకా ఎక్కువగా దిగుబడులు సాధించ గలను..

నేను అమెరికా లో తెచ్చుకునే జీతం డబ్బుల కంటే ఎక్కువ ఇక్కడే సంపాదించి చూపిస్తా.. నాలాగ ఇంకా కొంత మంది రైతు బిడ్డలను వ్యవసాయం లోకి తీసుకు వచ్చి దేశానికి వెన్నెముక గా వున్న రైతులకు దన్నుగా ఉంటా” అని ఆర్ద్రతతో అన్నాడు మహేష్.

అప్పుడెప్పుడో మామిడి చెట్టు వదలి ఎగిరి వెళ్ళిపోయిన కోయిల మళ్ళీ చెట్టుమీద వాలి ఆనందం తో కూయడం మొద లెట్టింది. 

రంగనాథం గారు ఆయన భార్య ఫోటోని తిరిగి గోడకు పెట్టడం లో నిమగ్నమయ్యాడు.


రచన : శ్రీనివాస

 శాస్త్రి.

Comments

Post a Comment

Popular posts from this blog

బెదురు

ఒక నువ్వు ఒక నేను