బెదురు

 అంశం: బెదిరి పోతున్న మనిషి 


సంధ్య వేళ వరకు ఆడిపాడి 

నిశి రాత్రి చీకటి లో 

అదృశ్యమైన ఆరేళ్ల పసిపాప 

మిన్నాగుల విషపు గాట్లకు 

బలి అయ్యి పొద్దున్నే 

చినిగి పోయి కనిపించ గా

హతాసులై న జనం..

రోదన మరచి చేష్టలుడిగిన 

ఆడ పిల్ల తల్లి తండ్రులు 

ఇప్పుడు మనుషులంటే

బెదిరి పోతున్నారు….


ప్రకృతి నే ఎదిరించి

గాలి లో కనిపించని రహదారులు

నిర్మించిన మనిషి మేధ కు 

పెను సవాలుగా మారుతూ…

యముని మహిషపు 

కాళ్ళ గిట్టల కింద చిక్కుకొని 

ఒక్కొక్కటిగా కూలిపోతున్న

లోహపు విహంగాలు…

క్షణాల్లో మాంసపు

గుట్టలు గా మారుతున్న 

మనుషుల శరీరాలు…

తలచుకొని గగుర్పాటుతో

ప్రయాణం అంటే

బెదిరిపోతున్న మనిషి.


లంచగొండి అధికారులు 

ధనదాహపు నాయకులు 

వాళ్లు పెంచి పోషించిన 

రియల్ ఎస్టేట్ వ్యాపారుల 

కాగితాల వలలో చిక్కి..

సంపాదించింది..

సంపాదించబోయేది ..

అంతా ధారపోసి…

బ్రతుకును తాకట్టు పెట్టి .

తెలియక చెరువు శిఖంలో ఇల్లు 

కొన్న మిడిల్ క్లాస్ జీతగాడు..

మొన్నటి వరదలు మళ్లీ 

ముంచేస్తే ,బతకడానికి

బలుసాకును ఎక్కడ 

అడుక్కోవాలో తెలియక

బెదిరి పొతున్నాడు.


బయటి ప్రపంచంలో 

అడుగడుగునా 

ఎదురవుతున్న 

ఇలాంటి ఎన్నో అనుభవాలతో 

మనిషి ఇప్పుడు 

వేడి వేడి పాలనే కాదు 

చల్లటి నీళ్లను కూడా 

ఊదుకుంటూ తాగుతున్నాడు.


Comments

Popular posts from this blog

ఉగాది ప్రసాదం

ఒక నువ్వు ఒక నేను