నీటి కావడి

 కథ: నీటి కావడి.


“ఎన్ని ప్రభుత్వాలు మారినా మనకి మాత్రం ప్రతి వేసవి లో ఈ నీటి తిప్పలు తప్పడం లేదురా అబ్బాయ్” అన్నాడు రంగయ్య.

“మరే, బాబాయ్. వేసవికంటే ఎంతో ముందుగానే ఊళ్ళో బావులు,బోర్లు అన్నీ ఎండిపోవడం , ఎర్రటి ఎండల్లో నీళ్ళ కోసం ఊరికి మైలు దూరం లో ఉన్న ఈ పెద్ద బావికి రావడం మనకు తప్పడం లేదు” అన్నాడు రోశయ్య..

అవునూ రోడ్లు తవ్వి గొట్టాలు ఏవో వేస్తున్నారు.. అవేమిటో తెలుసా’ అడిగాడు రంగయ్య.

“అవును బాబాయ్.. మన ఊరి బయట చెరువు తవ్వించి, అక్కడ నుండి పైపుల ద్వారా ఏడాది పొడుగునా ఇళ్ళ వద్దకే నీరు సరఫరా చేస్తారట”. అన్నాడు రోశయ్య.

“ అయితే త్వరలో ఊరి జనాలకు ఈ నీళ్ళబాధ తీర బోతున్నది’ అంటూ సంతోషించాడు రంగయ్య..

“చూద్దాం బాబాయ్ గవర్నమెంట్ పనులాయే, అవి ఎప్పటికి పూర్తి అయ్యేనో.ఇప్పటికయితే కడవ ఎత్తుకో అని పెద్దాయనకు కడవ భుజానికి ఎత్తుకోవడానికి సాయం చేసి, తన నీళ్ళ కావడిని భుజాన వేసుకున్నాడు రోశయ్య.


******

“పెదనాన్నా! మేము వేసవి సెలవులకు

అమ్మమ్మ గారి ఊరు వెళ్ళేప్పటికీ స్కూల్ దారిలో తుమ్మ చెట్లు ఉండేవి.. రెండు నెలల్లో చెట్లన్నీ కొట్టేసి చుట్టూ మట్టితో కట్ట పోసి ఉంది.. ఇప్పుడు ఈ ఊరి ముఖచిత్రమే మారిపోయింది” అన్నాడు శ్రీను..

“అవును! నెదర్లాండ్స్ వారు బాగా నీటి ఎద్దడి ఉన్న కొన్ని గ్రామాలను దత్తత తీసుకొన్నారట.. మన గ్రామం లో కూడా చెరువును త్రవ్వించారు. నిధుల కొరత లేదు కనుక పనులు చాలా వేగంగా చేస్తున్నారు” ఆనందంతో చెప్పారు వెంకట్రామయ్య గారు..

“అయితే ఇకనుండి మా స్నేహితులు సుబ్బారావు, హనుమంతు, లకు రోజూ స్కూలు వదల గానే నీళ్ళ కడవలు మోసే పనిలేదు . వాళ్ళు కూడా సాయంత్రం మాతో కలిసి ట్యూషన్ కి వస్తారు. కలిసి చదువుకుంటాం! అని ఆనందించాడు శ్రీను.


*****

“అరే అబ్బాయ్.. ఇళ్ల దగ్గరకే నీళ్లు వస్తున్నాయి అనే సంతోషం ఒక సంవత్సరం లోనే ఆవిరై పోయిందిరా”. “ప్రతి ఇంట్లో ఒక మనిషి కూలీ మిగిలింది కదా అనుకున్నాం. నేనుకూడా పనికి వెళ్ళి, ఇంట్లో కోడలి చేతిలో కొంత డబ్బును పెట్టేవాడిని. అత్తమ్మ కు మందుల ఖర్చులు పోగా ఇంటిల్లిపాదీ ఒక పూటైనా కూర మెతుకులు తింటున్నాం మామయ్యా” అని కోడలు అంటుంటే ఎంతో సంతోషించా” బాధతో అన్నాడు రంగయ్య.

“నేను కూడా పట్నం వెళ్ళి ఐటీఐ లో చేరా బాబాయ్.. అయిపోగానే అక్కడే ఏదన్నా కార్ఖానా లో పనికి కుదురుదాం అనుకున్నా. మా అమ్మా నాన్నా పెద్ద వారై పోయారు.. నీళ్లు లేకుండా బ్రతుకే లేదు కదా.. నాకు తిరిగి రాక తప్పలేదు ఏం చేస్తాం. మన ఊరికి, మాలాంటి యువకులకు బాగు పడే యోగం లేదు.” అన్నాడు రోశయ్య ...

ఇంతకీ కుళాయిలు ఎందుకు పనిచేయడం లేదో ? చేదని బావి లోకి వదులుతూ ప్రశ్నించాడు రంగయ్య.

“కాంట్రాక్టర్ డబ్బుకు కక్కుర్తి పడి నాసిరకం మోటార్లు బిగించాడట బాబాయ్..అవి మొన్న వర్షాకాలం పిడుగు పాటుకు కాలిపోయాయి” అంటూ చేద తాడు అందుకున్నాడు రోశయ్య.

“పిడుపాటును తట్టుకునే పరికరాలు ఉంటాయట , కానీ డబ్బు ఆదా కోసం వాటిని కాంట్రాక్టర్ బిగించ లేదు.

అదే కాక జాయింట్లు పగిలి పైపులన్నీ మట్టితో కూరుకు పోయాయట.. కనుక ఇక కుళాయిల సంగతి మరిచి పో..

ప్రభుత్వము మంచి పని చేయాలన్నా ఇదిగో ఇలాటి కాంట్రాక్టర్ల వల్ల వాళ్ళకు చెడ్డపేరు! జనానికి తిప్పలు! తప్పడం లేదు” అన్నాడు రోశయ్య..

“రాజుల సొమ్ము రాళ్ళ పాలు! నేటి పాలన లో ప్రజల డబ్బు కాంట్రాక్టర్ల పాలు! మాకు రేపటి నుండీ మళ్ళీ రెండుపూటలా చల్ల బువ్వ నే, గొణుక్కుంటూ కడవ భుజానికెత్తుకున్నాడు రంగయ్య.

*****

స్కూల్ నుండి ఇంటికి వస్తూ ఉంటే నెత్తిమీద నీళ్ల కడవ పెట్టుకుని కనిపించాడు సుబ్బారావు.

“శ్రీనూ నేను ఈరోజు నుండీ ట్యూషన్ కి రావడం లేదు” అనుకుంటూ వెళ్ళి పోతున్న స్నేహితుని కేసి విచారంగా చూసాడు శ్రీను.


రచన: శ్రీ

నివాస శాస్త్రి.


Comments

Popular posts from this blog

బెదురు

ఉగాది ప్రసాదం

ఒక నువ్వు ఒక నేను