జ్ఞాపకాల అల్మారా
చెరిగిపోని ముద్రలు
*ఓ వెన్నెల రాతిరి లో
ఆకాశపు పందిరికింద
ఆలోచనల అంపశయ్య పై
ఒంటరి నై కూర్చున్నా..
ఒక్కసారి ఒళ్ళంతా
గగుర్పాటు కు గురి కాగా
మనసంతాముసిరిన
పాత జ్ఞాపకాల ముద్రలు.
వెన్నెలలోని వేడి కాల్చేస్తూ ఉంటే
తలపై కూలుతున్న ఆకాశం.
మీదపడి గాయపరుస్తున్న
నక్షత్రాలు.
చెవుల్లో హోరెత్తిస్తున్న నిశ్శబ్దపు హాహాకారం.
వీటిని తప్పించుకుంటూ ఉండగానే,
చుట్టేస్తున్న ఒంటరి తనపు రాక్షసుడు.
జ్ఞాపకాల దొంతరలో
అనుభవాల మిణుగురులు
మిణుకు మిణుకు మనుకుంటూ
గుండె నుచీలుస్తూ పోతున్నాయ్.
మనసులో మెదిలిన
ఏకాంతపు మధురానుభూతులు,
కనులముందు
ఒక్కటిగా మెదులుతున్న
జ్ఞాపకాల ముద్రలు.
ఏవీ ఆ విరిమల్లెలు
ఏవీ ఆ పరిమళాలు
ఏవీ ఆ పరవశాలు
ఏవీ ఆ పరిష్వంగనాలు.
చెల్లిపోయే ఊసులన్నీ
చెదరిపాయే కలలన్నీ
ఒంటరి ఈ యుద్ధం లో
ఎదుట ఎవరు కనిపించరు.
కఠినమైన మాటలతో
వాడి వాడి చూపులతో
గుచ్చి నన్ను పోతుంటే
దుఃఖపు లోగిళ్ల మధ్య
చిక్కుకున్న నా హృదయం
రక్తమోడి నలిగి పోగా..
నిశ్శబ్దపు గావు కేక
దిక్కులలో ధ్వనీయించెను….
కానీ నాలో నే నీవు కనుక
నిన్ను కింద పడ నివ్వను.
నన్ను నే పదిలపరచుకుంటూ,
కలిసిన కాలాన్నే తలచుకుంటూ,
మధుర క్షణాల్ని పరచుకొంటూ,
గుండెలో నీ జ్ఞాపకాలను దాచుకుంటూ,
నా ప్రేమ నిత్యము సత్యము
అని నిరూపించడానికి
జీవించి ఉంటా, జీవించే ఉంటా..
Comments
Post a Comment