ఏ కులం

 కథా శీర్షిక: మనిషి కులం 


“ఇకనైనా కోపం మాని భోజనం చెయ్యి జానకీ. రెండు రోజులనుండీ ఏమీ తినకుండా ఆ మొబైల్ మెసేజ్ చూస్తూ అలానే పడుకున్నావు” అంటున్న రామ శర్మ గారి వైపు ఆమె తీక్షణం గా చూసింది. 

“నీకే కాదు నాకు కూడా కోపం వచ్చింది. ఆ మాట కోస్తే ఆ మెసేజ్ చదివిన తరువాత ఏ తల్లి దండ్రులకైనా అలానే ఉంటుంది. మనమా పెద్దవాళ్ళం అయ్యాము. మన 

ఆరోగ్యం కూడా ముఖ్యం కదా” అని భార్య ను అనునయించడానికి ప్రయత్నిస్తున్నారు రామ శర్మ గారు.

విన్పించుకోనట్టు కళ్ళు మూసుకుని పడుకుంది జానకమ్మ.

పక్కనే ఉన్న వాలు కుర్చీలో కూలబడి ఆమెకు ఎలా సర్ది చెప్పాలో తెలియక ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నారు శర్మ గారు. కొడుకు పంపిన వాట్సప్ మెసేజ్ మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకున్నాడు.

“అమ్మా నాన్నలకు నమస్కారములు. ఇక్కడే అమెరికాలో నాతో కలిసి పనిచేస్తున్న డాక్టర్ రమ్యారావు నేను చాలా కాలం గా ప్రేమించు కుంటున్నాం. ఇద్దరికీ గ్రీన్ కార్డులు వచ్చాయి. ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము. మీకు ఇన్నిరోజులనుండీ చెప్పాలంటే భయం వేసింది. మీ శ్రోత్రియ జీవన విధానాన్ని చిన్నప్పటినుండీ చూసిన వాణ్ణి కనుక, మా కులాంతర వివాహాన్ని మీరు ఇష్టపడరు, అనే ఉద్దేశ్యం తో ఇక్కడే అట్లాంటా లోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షం లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. మీరు సహృదయం తో మా వైవాహిక జీవితం సుఖమయం, దిగ్విజయం, కావాలని ఆశీర్వదించ వలసినది ….. ఇట్లు….. మీ కుమారుడు…డా.రమేష్…..

ఈ మెసేజ్ ని శర్మగారు గత రెండు రోజులుగా మననం చేసుకుంటూ ఆలోచిస్తూనే ఉన్నాడు.

“మనం వాడిని పెంచి పెద్ద చేసి డాక్టర్ చదువు చదివించి అమెరికా పంపించాము.. అది మన కర్తవ్యం జానకీ.. వాడు ఇప్పుడు పెద్దవాడై పోయాడు. వాడికి సంబంధించి మంచి చెడు వాడు ఆలోచించుకో గలడు”.

అంటూ ఆమె వైపు చూశాడు. 

కొంచెం కోపం తగ్గి శాంతంగా వినడం మొదలు పెట్టింది, అని అర్థం అయి, శర్మ గారు కొనసాగించాడు.

“రెక్కలు వచ్చిన దాకానే తల్లి దండ్రులకు పిల్లల బాధ్యత, ఇది అన్ని జంతువులు పక్షులు పాటిస్తాయి. ఇదే సృష్టి ధర్మం” అన్నారు శర్మ గారు.

చివుక్కున మంచం మీద లేచి కూర్చుంది జానకమ్మ. “కాదండీ వాడికి అమ్మ నాన్న లేరు అనుకున్నాడా? లేక, పెంచి పెద్ద చేసిన వాళ్ళం మనం వాడికి పెళ్ళి చేయలేని దుస్థితిలో ఉన్నామని అనుకున్నాడా? అయినా వేరే కులం పిల్ల అంటున్నాడు. నలుగురిలో మనం మొహం ఎలా చూపించడం?”  

అని చీర కొంగు నోటికి అడ్డం పెట్టుకుని శోకరాగం అందుకుంది జానకమ్మ.

“ఏ సమస్య కయినా ఏదో ఒక సమాధానం ఉంటుంది జానకీ. నువ్వు నిద్రాహారాలు మానేస్తే ఏమైనా పెను మార్పులు వస్తాయనుకుంటే అది నీ భ్రమ. ఈరోజు నీవు భోజనం చేయక పోతే నేను కూడా చేయను” అని కటువుగా అన్నారు శర్మ గారు.

జానకమ్మ వెంటనే లేచి నిలబడి “అయ్యో పాపిష్టి దాన్ని, మిమ్మల్ని కూడా ఆకలితో ఉంచుతున్నాను. మన్నించండి, ఏదోకన్న పేగు బాధను దాచుకోలేక అలా అన్నాను, క్షమించండి” అని గబ గబా స్నానం చేసి మడి బట్ట కట్టుకుని వంట చేసింది.

ఈలోపల శర్మగారి పూజా కార్యక్రమం ముగిసింది.

“ఏమండీ భోజనానికి లేవండి, మీకిష్టమని మిరియాల చారు పెట్టి, గుమ్మడి కాయ వడియాలు వేయించాను” అని పిలిచింది.

భోజనం చేస్తూ శర్మ గారు తన భార్య తో “మన రోజులు వేరు, ఈ రోజులు వేరు. అప్పుడు మన కాలంలో అందరమూ ఒకే ఊరిలో, ఒకే సమాజంలో, ఒకే చోట ఉండేవాళ్ళం” 

కొత్త అవకాయని అన్నం లో కలుపుకుంటూ చెప్పడం కొనసాగించాడు.

 “కులాలు అనేవి వారి వృత్తులను బట్టి ఏర్పడినవి అని, ప్రతి ఊరిలో అన్ని పనులవారు నివాసం ఉంటూ, వారి గ్రామీణ జీవనానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ ఆ ఊరిలోనే సమకూర్చుకొని, స్వయం సమృద్ధిగా బ్రతకడానికి పూర్వీకులు ఏర్పరచుకున్న జీవన విధానం, ఈ కుల వ్యవస్థ అని నీకు తెలియనిది కాదు” అని కొంచెం నెయ్యి వడ్డించు” అని అవకాయ అన్నం లో దిట్టంగా నెయ్యిని వేసి కలిపారు శర్మ గారు.


“అది సరే నండి, పెళ్ళిళ్ళ వ్యవస్థ లో ఇంకా ఇప్పటికీ కులాల పట్టింపు అనేది ఉన్నది కదా. బంధువుల మధ్య మనకు తలవంపులు గా ఉండదా “ ఆయనకు అడ్డు తగులుతూ అడిగింది జానకమ్మ.


“జానకీ, ఒక సముదాయం లో పెరిగిన ఆడపిల్ల, ఆవృత్తుల వారి జీవన శైలికి బాగా అలవాటు పడి ఉంటుంది. అందుకని అదే కుటుంబాల్లో పెళ్లి చేసుకుని వస్తే ఇట్టే అత్తగారింట్లో ఇట్టే కలిసిపోతుంది. వారికి పనులలో చేదోడు వాదోడుగా ఉంటుంది.


ఉదాహరణకి కుండలు చేసేవారు, తెల్లవారు జామునే లేచి మట్టి పిసకవలసి ఉంటుంది వేరే కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయికి అది ఇష్టం లేకపోవచ్చు, ఆ పని తెలియక పోవచ్చు.


అలానే పురోహితం చేసుకునే వారి ఇంట్లో కొన్ని కఠిన నియమ నిష్ఠలు పాటించవలసి ఉంటుంది. వేరే సముదాయం నుంచి వచ్చిన అమ్మాయికి ఇవి అన్నీ పాటించడం కష్టం కావచ్చు.


అందుకని పెళ్లిళ్లలో కులాలను పాటించటం జరుగుతూ వచ్చింది. ఇప్పటి జనరేషన్ వేరు జానకీ. పెరిగిన జనాభా కి అనుగుణంగా , ఎంతోమంది పల్లెలను వదిలి చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, దేశ విదేశాల్లో స్థిర పడుతున్నారు, కులవృత్తులుఎప్పుడో కనుమరుగు అయిపోయాయి”. అన్నారు శర్మగారు.


“అవును కదా” అన్నట్టు ఆలోచనలో పడింది జానకమ్మ. 


“మన అబ్బాయి అమెరికా లో డాక్టర్ . ఆ అమ్మాయి కూడా డాక్టరే. కనుక డాక్టర్ వృత్తి లోని కష్ట నష్టాలు ఇద్దరికీ తెలిసి ఉంటాయి కాబట్టి వారి మధ్య సయోధ్య బాగా ఉండి వారి సంసారం సుఖమయంగా సాగుతుంది” అని నా అభిప్రాయం అన్నారు.

“ఇంతకీ ఆ అమ్మాయి ది ఏ కులం అట, అదన్నా మీకు చెప్పాడా?” ఆరా తీసింది జానకమ్మ.

నేను అడగలేదు. ఇద్దరిదీ వైద్య వృత్తి కనుక వృత్తి ని బట్టే కులం అనే ప్రామాణికం గా వారిరువురిదీ ఒకటే కులం, అదే “వైద్య కులం”, కాబట్టి నేను వారిది కులాంతర వివాహంగా చూడడం లేదు. అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేశారు శర్మ గారు.

జానకమ్మ గారు “వైద్యకులమా” అని అంటూ 

చారన్నం లో తాపీగా వడియాలు నంజుకుంటున్న శర్మగారి వైపు భ్రుకుటి ముడి వేసి ప్రశ్నార్థకంగా చూసింది.

అవును “వైద్యకులం” అంటూ పెరుగు వడ్డించు కొన్నారు శర్మగారు.


(అయిపోయింది)


రచన: 

శ్రీనివాస శాస్త్రి.

Comments

Popular posts from this blog

బెదురు

ఉగాది ప్రసాదం

ఒక నువ్వు ఒక నేను