శివం సత్యం

 అంశం:సర్వం శివమయం

శీర్షిక: శివ పూజ 

రచన: శ్రీనివాస శాస్త్రి 

ది. 27.02.2025.


🙏

శివుని నమ్ముకో నరుడా 

హరుని గొలువరా నరుడా

శివుని నమ్మితె నీకు 

చింతలన్నియు దీరు 

హరుని గొలిచిన నీకు 

శాంతి సౌఖ్యము గల్గు.. 

శివుని నమ్ముకో నరుడా 

హరుని గొలువరా నరుడా..


మంగళా కారుడిని 

మదిలోన తలచుకొని

శివరాత్రి జాగరము 

అభిషేక అర్చనలు

అరయమ్ము గా నీవు

అనుసరించితి వేని

సుఖ సంపదలనిచ్చు నరుడా

స్వామి సర్వమంగళుడురా నరుడా.

శివుని నమ్ముకో నరుడా 

హరుని గొలువరా నరుడా…..


ఈతిబాధలతొ నీవు 

ఇసుమంత భయపడక

పరమేశ్వరుని ముందు 

శరణంటు తలదించి 

వినయమ్ము తో నీవు 

మోకరిల్లితి వేని 

రోగాలు బాపురా నరుడా 

స్వామి భోగాలు కలిగించు నరుడా 

శివుని నమ్ముకో నరుడా 

హరుని గొలువరా నరుడా.


మల్లి జాజుల పేరు 

మాలలే పనిలేదు

మారేడు ఆకులను 

కోసి దెచ్చిన చాలు.

పన్నీరు పరిమళ 

ద్రవ్యాలు లేకున్న.

శివశివా యనుచును 

జలముపోసినచాలు.

పెట్టడానికి పట్టు

వలువలే పని లేదు 

భవభవా యనుచూ 

భస్మముంచిన చాలు.

పొంగి పోతాడురా నరుడా..

స్వామి నినువీడి పోడురా నరుడా..

శివుని నమ్ముకో నరుడా 

హరుని గొలువరా నరుడా…..


భక్తితో గొలిచితే 

భయము పోగొడతాడు

శరణన్నవారినీ 

కరుణ తో చూస్తాడు.

పార్వతీ పతి ముందు 

ప్రణమిల్లి తే నీవు

భద్రమ్ముగా నిన్ను 

దరి జేర్చుకుంటాడు.

భవహరుడు విషహరుడు నరుడా

స్వామి జగతినేలే ప్రభువు నరుడా 

శివుని నమ్ముకో నరుడా 

హరుని కొలువరా నరుడా

శివుని నమ్మితె నీకు 

చింతలన్నియు దీరు 

హరుని గొలిచిన నీకు 

శాంతి సౌఖ్యము గల్గు.. 

శివుని నమ్ముకో నరుడా 

హరుని కొలువరా నరుడా..

*************************


Comments

Popular posts from this blog

బెదురు

ఉగాది ప్రసాదం

ఒక నువ్వు ఒక నేను