కొడుకు పై ప్రేమ
కథ : తల్లి _ కొడుకు
“మీరు మీ అబ్బాయి స్కూలు డైరీ రోజూ చూడాలండి, లేకపోతే హోమ్ వర్క్ ఏదన్నా మిస్ అవుతే మీ వాడిని క్లాస్ లో పీరియడ్ అంతా నిలబెట్టేస్తారు వాడి మిస్ లు”..
పోయిన సారి పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో వాళ్ళ క్లాస్ టీచర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి చింటూ గాడి స్కూలు బాగ్ సర్దుతూ డైరీని కేసువల్ గా తెరిచింది రాజీ..
ఒక్కసారిగా గుండె గుభేల్.. చింటూ గాడు రాత్రి అన్నీ హోమ్ వర్క్లు చేశాడు కానీ మ్యాథ్స్ హోమ్ వర్క్ చేయలేదు..
వాడికి మొదటినుండీ నంబర్స్ అన్నా
టేబుల్స్ అన్నా ఇంట్రెస్ట్ ఉండదు.. అనుకుంటూ..
గుడి దగ్గర పంజరం లో చిలక ఎదురు పేక దొంతర లోనుండి ఒక్క కార్డు తీసినట్లు గా
చింటూ నోట్ బుక్ దొంతర లో నుండి స్క్వేర్ రూల్ వర్క్ బుక్ వెతికి టక్కున ఓపెన్ చేసింది రాజీ...
ఇంకా నిద్ర మత్తు లోనే ఊగుతూ
“ఊఉఊ ఈ రోజు హార్లిక్స్ వద్దు మమ్మీ నాకు బూస్ట్ కావాలి”
అని ఇప్పటిదాకా మారాం చేసి సాధించిన బూస్ట్ పాల గ్లాస్ ను ఒక చేత్తో పట్టుకుని తాగ డానికి రెడీ అవుతున్నాడు చింటూ..
“ఒరేయ్ రాత్రి మ్యాథ్స్ హోమ్ వర్క్ ఉందని చెప్పలేదేం”
అంటూ హడావుడిగా వాడి చేతిలో పెన్సిల్ పెట్టింది..
వాడు నేను వ్రాయనని గోల గోల చేస్తున్నాడు..
“వాడిని పాలు తాగ నీయి అమ్మా, పసి వె ధవ, ఆకలి తో ఉండి చదువు ఏమి చదువుతాడు, ఆ వయస్సులో వాడు స్కూల్ కి పోవడమే గొప్ప..మారోజుల్లో స్కూల్ కి రాని పిల్లలకోసం ఊళ్ళోకి మోతాదు ని పంపేవాడు హెడ్ మాస్టారు..వాడ్ని చూసి పిల్లలు దాక్కునే వారు..వాడు ఒక్కొక్కరినీ చెవులు పిసుక్కుంటూ స్కూలు కి ఎత్తుకెళ్లేవాడు…
పాత రోజులు గుర్తుకు చేసుకుంది అనసూయమ్మ…
ఒక్క లెక్కలేగా .. పోనీలే..ఒక్క హోమ్ వర్క్ చేయకపోతే ఏమీ కాదులే”
అని గట్టిగా అరిచింది ..
“మీకు తెలీదత్తయ్యా, ఇవి మీరోజులు కావు..
మీరూరుకోండి..
అమ్మో వాడు అంతసేపు క్లాస్ లో నిలబెడితే కాళ్లు నొప్పులేయవూ”..
అంటూ ఒక్కసారి గడియారం వైపు చూసి అమ్మో అనుకుని
చివరికి వాడి చేతిని పట్టుకొని తనే వ్రాయడం పూర్తి చేసింది..
రాసింది తను అయినా వాడి వేలు పట్టి వ్రాయించి, కొంతలో కొంత వాడే వ్రాసినట్టు గా శాటిస్ఫై అయింది..
“అత్తయ్య,ఈయన కోసమని పొయి మీద వంట పెట్టాను.. ఒకసారి చూడండి మాడిపోతుందేమో, చింటూ గాడి పనిలో పడి మరచిపోయాను”.
అని రిక్వెస్ట్ టోన్ లో అరిచింది రాజీ…
“అయ్యో ఇప్పుడా అమ్మా చెప్పేది.. నన్ను వంటగదిలోకి వెళ్లొద్దు అంటావ్ గా.. నే ననుండగా నీకెందుకు అత్తయ్యా శ్రమ,అని అంటున్నావని పట్టించుకోవడం మానేసా”
అనుకుంటూ లోపలికి వెళ్ళారు అనసూయమ్మ గారు..
చింటూ గాడిని స్కూల్ కి పంపడం లో తలమునకలై ఉంది రాజీ.
వాడు చదివేది LKG చదువే కానీ మా ఇంజనీరింగ్గ్ చదివెప్పటి బుక్స్ కంటే వీడి బుక్స్ ఎక్కువ అంటుంటారు వీడి డాడీ..
ప్రతి సబ్జెక్ట్ కి టెక్స్ట్బుక్, వర్క్ బుక్,స్కూల్ వర్క్, హోమ్ వర్క్, సింగిల్ రూల్, డబల్ రూల్, ఫోర్ రూల్, స్క్వేర్ రూల్, ఇలా తడిసి మోపెడు.
అన్నీ చూసి ఏ బుక్ లో ఏమి హోమ్ వర్క్ ఉందో తనకే ఒక్కోసారి అర్థం కాదు, పసి వెధవ వాడికేలా తెలుస్తుంది , అనుకుంటూ బాగ్ సర్దేసింది..
పగలంతా చదువు, స్కూలు కి వర్క్, కంప్యూటర్, డ్రిల్, స్కేటింగ్, స్విమ్మింగ్, గేమ్స్, అమ్మో వాడికి సరైన ఆహారం లేకపోతే నీరస పడి పోతాడు..అని వాడి కోసం పొద్దున్నే లేచి కష్టపడి ప్రిపేర్ చేసిన రక రకాల స్నాక్స్, లంచ్, వాటర్ బాటిల్ అన్నీ జాగ్రత్తగా వాడి లంచ్ బ్యాగ్ లో సర్ది వాడిని అతి కష్టం మీదరెడీ చేసి బెల్ట్ పెడుతూ ఉండగానే
బయటనుండి స్కూలు బస్సు హార్న్ మోగింది.
“ అమ్మా స్నాక్స్ ఏమి పెట్టావు”, వాడు ఎగురు కొంటూ క్యూరియాసిటి ఆపుకోలేక రోజూ లాగే బెల్ట్ పెట్టేటప్పుడు అడిగాడు..
“ బుజ్జి, నీకిష్ట మైన బ్రెడ్ రోల్, చాక్లెట్, మార్నింగ్ రీసెస్ కి.. లంచ్ కి జీడిపప్పు ఉప్మా, ఆపిల్ ముక్కలు..సాయంత్రానికి
రీసెస్ లో తినడానికి క్రీమ్ బిస్కట్.. అన్నట్టుస్పూన్, ఫోర్క్పక్కజిప్లోపెట్టాచూసుకో” చెప్పింది రాజీ..
“అయితే ఒకే” అనుకుంటూ వాడు లంచ్ బాగ్ తీసుకున్నాడు..
బరువైన స్కూల్ బ్యాగ్ ను అమ్మకి వదిలేశాడు .
బాగును తను చేతిలోకి తీసుకుని
బతుకు జీవుడా అనుకుంటూ వాడిని లాక్కెళ్లినంత పని చేసి బస్ లోకి దాదాపు తోసి నంత పని చేసింది
బిక్క మొహం వేసుకుని చూస్తున్న వాడికి టాటా చెప్పి లోపలకు వచ్చి సోఫా లో కూల బడింది..
ఈలోపల చింటూ వాళ్ళ డాడీ రెడీ అయిపోయి బయటకు వచ్చి.
“రాజీ బై బై నేనువెళుతున్నా”
అని scooter స్టార్ట్ చేసుకుని laptop bag తగిలించుకుని వెళ్ళిపోయాడు.
అవునూ ..ఈయన చేతిలో టిఫిన్ బాక్స్ కనపడలేదే అని అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది రాజి
అక్కడ అనసూయమ్మ గారు మాడిపోయిన కూర ని డస్ట్ బిన్ లో వేస్తు కనిపించింది .
“కూర అంతా మాడి పోయింది . వాడు నాకు టైం అయిపోయింది నేను వెళ్తున్నాను” అని టిఫిన్ బాక్స్ తీసుకోకుండానే వెళ్ళిపోయాడు.
“పాపం మీ ఆయన ఈరోజు టిఫిన్ లో ఏం తింటాడో తింటాడో” ఆఫీసులో ఏమీ తినకుండా పని ఎలా చేస్తాడు”
అని రాగాలు తీసుకుంటూ బయటికి వెళ్లింది
అనసూయమ్మ
“ చింటూ గాడి ఒక్క హోంవర్క్ కోసమని మా అబ్బాయికి లంచ్ లేకుండా చేసింది”
అని పగలంతా కూని రాగాలు తీస్తూనే ఉంది
“అబ్బా , చచ్చారా బాబూ, ఇంక ఏముంది ఈ వారం అంతా ఫోన్ చేసిన వాళ్ళకి , చేయని వాళ్ళకి ఇదే విషయాన్ని చిలువలు పలువలు గా తనకొడుకి జరిగిన అన్యాయాన్ని ఈమె చెప్తూనే ఉంటుంది
”
అని నీరసంగా కుర్చీలో కూల బడింది రాజీ..
రచన: శ్రీనివాస శాస్త్రి
Comments
Post a Comment