అడివి రాజు
రచన: గోలి శ్రీనివాస శాస్త్రి
కథ : కరెంట్ షాక్.
“ శ్రీ టి.ధర్మారావు…మినిస్టర్ ఆఫ్ స్టేట్”
అని బయట బోర్డు చూసుకుంటూ లోపలికి వెళ్ళాడు అడవిరాజు .
“ఎవరండీ మీరు? ఏం కావాలి?”
పేషీ లో కూర్చున్న వ్యక్తి అడిగాడు.
“నా పేరు అడవిరాజు. మాది ఎర్రగొండ పాలెం దగ్గర‘కుంకుడు చెట్టు’ తండా. మినిస్టర్ గారి తో పని ఉండి వచ్చాను.” అన్నాడు అడవిరాజు.
లోపల జరుగుతున్న మీటింగ్ అయిపోగానే
పంపుతాను అని కూర్చో మని చెప్పాడు ఆ వ్యక్తి.
*******
“ ఏమి అడవి రాజు, ఎలా ఉన్నావు? ఏంటి మన తండా విశేషాలు” అని ఆప్యాయంగా పలకరించారు మినిస్టర్ గారు.
“మా ఊరి గురించిన ఒక సమస్య, మీకు చెప్పుకుంటే తప్పకుండా చేస్తారని వచ్చాను” అన్నాడు అడవిరాజు.
“రాజూ మీరు, మీ చుట్టూ ఉన్న ఇతర తండాల ప్రజలు నేను గెలవడానికి ఎంతో సహాయం చేశారు. నా వల్ల అయ్యే పని ఏదైనా తప్పకుండా చేసి పెడతాను”అన్నారు మినిస్టర్ గారు.
“సార్ , మీకు తెలిసిందేగా! మా ఊరు కృష్ణా నదికి కూత వేటు దూరం లో నల్లమల అటవీ ప్రాంతం లో ఉంటుంది. రెండు భారీ నీటి ప్రాజెక్టుల మధ్య ఉన్నా కూడా, మా ఊరికి చెందిన భూమికి సాగు నీటి ఏర్పాటు లేదు. అంతా వర్షాధార వ్యవసాయమే. పంటలు సరిగా పండక, మా ఊరి రైతులు కుటుంబ పోషణ కోసం బస్తీలో ముఠా పనుల కోసం వెళ్లాల్సి వస్తుంది.
“మాకు వ్యవసాయ కరెంట్ కనెక్షన్ లేదు. దానికి మూడు ఫేజ్ లు ఉండే తీగలు, ట్రాన్స్ ఫారం కావాలట. కొంచెం మీరు దయతలచి శాంక్షన్ చేయిస్తే మా రైతులకు ముఠా పనులకు పోయే బాధ తప్పుతుంది” అన్నాడు అడవిరాజు.
“అడవి రాజూ, మన ఊరి సమస్య అంటే అది నా సమస్య కిందే లెక్క. నేను డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి తప్పకుండా ఏర్పాటు చేస్తాను” అని మాట ఇచ్చారు ధర్మారావు గారు.
***************
కరెంట్ సబ్ స్టేషన్ లో ఇంజనీరు బంగారయ్య ను కలవడానికి వెళ్ళాడు అడవి రాజు.
“మాకైతే ఇంతవరకు పై నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదు. మీరు మినిస్టర్ గారికి రిప్రేజంటేషన్ ఇచ్చాము అంటున్నారు కాబట్టి. ఇంకొక వారం రోజులు చూద్దాం” అని అదే మాటను మళ్ళీ చెప్పాడు ఆ ఇంజనీర్.
విసుగు పుట్టి ఒకసారి మళ్ళీ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్దామని, బయలుదేరి వెళ్ళాడు అడవి రాజు.
“ఏమిటీ! ఇంకా మీ వ్యవసాయ కనెక్షన్ రాలేదా? నేను ఆరోజే మీ జిల్లా ఎస్.ఈ. గారికి చెప్పాను కదా? అనివెంటనే ఎస్.ఈ. గారి కి ఫోన్ చేశారు.
“అవును సార్. మీరు చెప్పింది నాకు బాగా గుర్తుంది. కొత్త గా వచ్చే అగ్రికల్చర్ కనెక్షన్స్ లో ‘కుంకుడుచెట్టు తండా’వాళ్లది టాప్ ప్రయారిటీ లో పెట్టాము. కావలసిన స్తంభాలు, తీగ, మిగతా మెటీరియల్ అన్నీ ఆర్డర్ పెట్టాము. రాగానే ముందు అక్కడికే పంపిస్తాను” అని రిప్లై ఇచ్చాడు ఎస్.ఈ.
“విన్నావుగా రాజూ. ఇదంతా గవర్నమెంట్ తో పని. నేను మినిస్టర్ని. అధికారులకు ఆదేశాలు మాత్రమే ఇవ్వగలను. మెటీరియల్ రాగానే మనకే ముందు స్తంభాలు, లైన్లు వేస్తారులే” అని చెప్పి పంపారు మినిస్టర్ ధర్మారావు.
***********
కాళ్ళు ఈడ్చుకుంటూ నిరాశతో తిరుగు ప్రయాణమయ్యాడు అడివి రాజు.
పల్లెవెలుగు బస్సులో కూర్చుని ప్రయాణిస్తూ బయట ఎండిపోయిన మెట్టచేల వైపు దిగులుగా చూస్తున్నాడు.
మధ్యలో ‘పర్లపాయ తండా’ వద్దకు రాగానే
ఒక్కసారిగా చల్లటి గాలి తగిలి హాయి గా అనిపించింది. అక్కడి పొలాలన్నీ వేసవిలో కూడా ఆకు పచ్చగా కళకళ లాడుతూ మెరిసి పోతున్నాయి. అడవిరాజుకి చాలా ఆనందం వేసింది. మా తండాకు కూడా కరెంటు తీగలు వస్తే మా ఊరు కూడా ఇలానే మారిపోతుంది. అనుకుని, “అవునూ! మొన్నటిదాకా వీరిది కూడా మా లాగా మెట్టభూమి కదా. ఈ ఊరికి వ్యవసాయ కరెంట్ ఎప్పుడు వచ్చింది? అని పక్కనే కూర్చుని ఉన్న ఆ ఊరి రైతు చలమయ్యని ఆరాతీశాడు.
“ కరెంట్ సబ్ స్టేషన్ కి వెళ్ళి బతిమలాడు కున్నాము. దుడ్డు ఖర్చు అవుతాది అన్నారు. మేమందరము మనిషికి ఇంత అని వేసుకొని ఇచ్చాము. పది రోజుల్లో స్తంభాలు, తీగలు వేశారు” అన్నాడు చలమయ్య.
“అలానే ఎమ్మార్వో ఆఫీస్ లో కూడా కొంత ముట్టజెప్పి మా తండాకు శాంక్షన్ అయిన రెండు మంచినీటి బోర్లు మా పొలాలలో వేయించాము. కొండ దిగువ ప్రాంతం కదా. పుష్కలంగా నీళ్లు పడ్డాయి. మా కరువు తీరింది. తండా లోని రైతులంతా ఇప్పుడు ఆనందం గా ఉన్నారు.
ఈ రోజుల్లో దుడ్డు ఇవ్వకుండా ప్రభుత్వం లో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు పనులు చేస్తున్నారు?
పనులు కావాలంటే చేతులు తడపాల్సిందే, తప్పదు” అన్నాడు చలమయ్య.
*******
“అదేమిటి మేము రెండు ఏళ్ళనుండి తిరుగుతుంటే వ్యవసాయ కనెక్షన్ ముందు మాకు ఇవ్వకుండా పక్క ఊరికి ఇచ్చావు. ఇదేమి అన్యాయం “ అని బంగారయ్యను అడిగాడు అడవిరాజు .
“పెద్దాయనా, ఇది కరెంట్ డిపార్ట్మెంట్. గవర్నమెంట్ తో పని. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు, ఇంజనీర్లు పనిచేయడానికి మొదటినుండీ ఒక పద్ధతి ఉన్నది. మీ పక్క ఊరి వారు ఆ పద్ధతిని పాటించి వారికి కావాల్సిన పని చేయించుకున్నారు.
మీరు మాత్రం మినిస్టర్ గారి రూట్ లో వచ్చారు. కాబట్టి మాకు పైనుండి శాంక్షన్ రాకుండా మేము ఏమీ చేయలేము”. అన్నాడు బంగారయ్య.
“మీరు లంచాలు తీసుకొని పనులు చేసి పెడతారా, ఇది అనైతికం’ అన్నాడు అడవి రాజు .
ఈ లోపల బంగారయ్య ఫోన్ రింగ్ అయింది.
“ఒక్క నిమిషం ఆగండి. మా ఎస్.ఈ. గారి ఫోను”అని అతను ఫోను లిఫ్ట్ చేశాడు.
“ఇదిగో బంగారయ్యా, పోయిన నెల కొత్త కరెంట్ లైన్ల తాలూకు వచ్చిన కలెక్షను అమౌంట్ అర్జంట్ గా పంపించండి. పైన పెద్దాయన అడుగుతున్నాడు. ఆయన వాటా ఆయనకు ఒకటో తారీఖు కల్లా ఇచ్చేయాలి. లేకపోతే ఊరుకోరు”
అని అంటున్న ఎస్.ఈ. గారి గొంతును కావాలనే అడవిరాజు కి వినిపించాడు బంగారయ్య.
అడవిరాజు కు ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినంత పనైంది.
“ఛీ, ఈ ప్రభుత్వయంత్రాంగము అధికారులు, అందరూ కుమ్మక్కైపోయారు. సామాన్యుడికి న్యాయం లేదు. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదు. మినిస్టర్ గారే చెప్పినా దిక్కు లేదు. ఇప్పుడు ఊరి వారికి నా మొహం ఎలా చూపించాలి? కావలసిన డబ్బు ఎలా ఏర్పాటు చేయాలి ? అని ఆలోచిస్తూ కుంకుడు చెట్టుతండా వైపుకు బయలు దేరాడు అడవిరాజు.
(అయిపోయిం
ది)
Comments
Post a Comment