అడవిలో ఆగమాగం

శీర్షిక: అడవి లో ఆగమాగం 

రచన: శ్రీనివాస శాస్త్రి. 19.04.2026.


“శ్రీధర్ కారు త్వరగా పోనీ, అంకిత్ కి ఎలా ఉందో ఏమో భయం గా ఉంది”.

“రమా అసలే ఎండాలం, మిట్ట మధ్యాన్నం. బైట విపరీత మైన ఎండ.. కళ్ళు స్ట్రెయిన్ అవుతున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీకి ఇంకా నాలుగు గంటలు పడుతుంది.

 “రాత్రి వాడు గదిలో ఫ్యాన్ కి ఉరి వేసుకుంటుంటే వాళ్ళ వార్డెన్ ఆ సమయానికి కిటికీ లోనుండి చూడబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఏమి జరిగి ఉండేదో” అంది బాధతో రమ .

“అవును, వాడికి ఏదన్నా ఇబ్బంది ఉంటే మనతో చెప్పాలికదా.. సరే కొంచెం నీళ్ళ బాటిల్ అందుకో దాహంగా ఉంది”నీరసంగా అన్నాడు శ్రీధర్.

“సారీ అండీ ,హడావుడి లో నేను ఎలా ఉన్నదాన్ని అలానే కారు ఎక్కేసాను.నా కూడా ఏమీ తీసుకోలేదు, చివరికి నా హ్యాండ్బాగ్ కూడా వదిలేశా, అని బాధ పడింది రమ.

“సరే ఇదంతా అడవి మార్గం లా ఉంది.. చూద్దాం..ఎక్కడన్నా నీరు దొరికే అవకాశం ఉందేమో” అనుకుంటూ ఒక గంట అడవి మార్గం లో ప్రయాణించిన తరువాత 

శ్రీధర్ కి దూరంగా ఒక పెంకుటిల్లు కనిపించి రోడ్ పక్కన కారు ఆపాడు. రెండు ఖాళీ బాటిల్స్ ఉంటే తీసుకుని , “రమా ఎండగా ఉంది కదా..ఇంజిన్ ఆన్ లోనే ఉంచా, ఏసీ నడుస్తుంది. నువ్వు నేను వచ్చిందాకా లోపలే కూర్చో” అని ఆ పెంకుటిల్లు వైపుకి వడి వడి గా అడుగులు వేశాడు.

ఎండ వేడి తీక్షణత కి తల పైన మండుతూ ఉంటే చిన్న టవల్ నెత్తిన వేసుకుని ఆఇంటి వైపుకి నడిచాడు శ్రీధర్.. తీరా అక్కడికి చేరాక ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. చుట్టూ పిచ్చి చెట్లు మొలిచి ఉన్నాయి..ఇంట్లో ఎవరూ ఉన్నట్టు లేదు. అనుకుంటూ ఇంటి గుమ్మం దగ్గరకు నడచుకుంటూ వెళ్లి లోపలికి తొంగి చూశాడు.

“ఏమండీ ఎవరైనా ఉన్నారా ఇంట్లో” అని అరిచాడు …లోపల నుండి ఏమి సమాధానం రాకపోయేసరికి, గుమ్మం తీసే ఉంది కదా లోపల ఎవరూ లేరేమిటి? అనుకుంటూ వెనుకకు తిరిగి చూశాడు.

ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. బయట గేటు దగ్గరనుంచి ముందుకు గుమ్మం వరకు పూర్తిగా ఎర్రటి రక్తం మడుగులు. దాంట్లో నుంచే తను నడుచుకుంటూ వచ్చాడు.

ఒకసారి గుండె గుభేల్ మంది..మనసు కీడు శంకిస్తుంటే గిరుక్కున వెనుదిరిగాడు ..వడి వడి గా అడుగులు వేయబోయి హడావుడి లో ఆ రక్తంలో నే కాలుజారి కిందపడ్డాడు.

అమ్మా అని మూలుగుతూ మెల్లిగా లేచి టవల్ తో ఒళ్ళంతా తుడుచుకుంటూ, కారు వైపు పరుగు తీశాడు శ్రీధర్ .

*******

పాపం ఈయన మంచినీళ్ల కోసం వెళ్ళాడు . ఆ ఇంట్లో నీళ్లు దొరికితే బాగుండును.

అనుకుంటూ శ్రీధర్ వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుంది రమ..

ఒకసారి టైమ్ చూసుకుంది. మధ్యాహ్నం పన్నెండు గంటలు టైమ్ చూడగానే అమ్మ చెప్పిన అనుభవాలు గుర్తుకొచ్చి భయమేసింది.

 మిట్టమధ్యాహ్నపు వేళల్లో ఎప్పుడూ బయటికి పోవద్దు. అని చెప్తూ ఉండేది అమ్మ.

తమ ఊరిలో మధ్యాహ్నం వేళల్లో పొలాల మధ్య నుండి నుండి తిరిగి ఇంటికి వస్తున్నసమయం లో దారి మధ్యలో ఒక దిగుడు బావి ఉండేదట. దాని ఒడ్డున ఎర్రటి ఎండలో కొన్ని తెల్లటి ఆకారాలు జుట్టు విరబోసుకుని, ఎర్రటి మిడిగుడ్లతో కనిపించేవట.. దగ్గరకు రాగానే చటుక్కున బావిలోకి దూకేవట..

ఇప్పుడు ఈ అడవిని చూస్తుంటే అమ్మ వివరించిన లోకేషన్స్ లాగే అనిపించి ఒక్కసారిగా భయమేసింది రమకి.

ఈలోపల కారు ముందుకు కదులుతు న్నట్టుగా అనిపించి అయ్యో ఆలోచనలో పడి నేను ఈయన వచ్చింది కూడా చూసుకోలేదు అనుకొని “ఏమండీ మంచినీళ్లు దొరికాయా” అని అడుగుతూ మందు సీట్లో చూసి ఒక్కసారిగా కొయ్యబారిపోయింది రమ.

శ్రీధర్ కాదు..తన కొడుకు అంకిత్ కారు డ్రైవ్ చేస్తున్నాడు.. “మమ్మీ నాకు డ్రైవింగ్ రాదు అన్నావు కదా…చూడు ఇప్పుడు నీకు మన కారు డ్రైవ్ చేసి చూపిస్తాను. కానీ నాన్నతో చెప్పకు ప్లీజ్” అని కార్ ని కొంచెం ముందుకు తీసుకెళ్లి రోడ్ పక్కన పార్క్ చేశాడు…

అది తన భ్రమ నో నిజమో తెలియక భయం తో పెద్ద కేక వేసి వెనక్కి వాలి పోయింది రమ.

••••••••

రమ కళ్ళు తెరువు అన్నాడు శ్రీధర్ .

దేని కో భయపడింది అని “ఏమైంది రమా” అని ఆతృత తో అడిగాడు.

తను ఏమీ మాట్లాడలేక పోతోంది. డ్రైవింగ్ సీటు వైపు వేలు చూపిస్తూ అంకిత్ అంకిత్ అని గొణిగింది.

తను చూసిన దృశ్యం లాంటిదే ఈమె కూడా ఏమన్నా చూసిందేమో.. ఈ ప్లేస్ సరి అయింది కాదు, తెలీక కారు ఇక్కడ ఆపాను. అని అనుకుంటూ ఒక్కసారిగా విపరీతమైన దాహం, అలసట, నిస్సత్తువ ఆవహించగా తను కూడా కిందకు వాలి పోయాడు.

••••••••••

మొహం మీద చల్లని నీటి చుక్కలు చల్లినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూశారు రమా శ్రీధర్లు

ఇద్దరూ..

“అమ్మయ్య కళ్ళు తెరిచారా? ఏం జరిగింది ఎందుకు అలా పడిపోయారో అని కంగారుపడ్డి పోయా”..నేను ఈ ఫారెస్ట్ లో గార్డుని .. డ్యూటీ మీద అడవిలో తిరుగుతూ ఉంటా..అన్నాడు ఆ వ్యక్తి. 

వెంట నీళ్లు తెచ్చుకోవడం మర్చిపోయాము. దాహం వేసింది, దాంతో నీరసం వచ్చి పడిపోయాము థాంక్స్ అండి అంటూ 

శ్రీధర్ జరిగిన విషయం అంతా చెప్పాడు.

“ఆ ఇంట్లో ఎవరూ ఉండరండి అది ఒకప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ బంగ్లా ఇప్పుడు ఖాళీ చేసేసారు. పిచ్చి చెట్లు అవి మొలిచి ఉంటాయి”.  

ఈమధ్య ఒక చిరుత పులి తిరుగుతున్నదని గ్రామస్తులు కంప్లైంట్ చేస్తే మాకు దాని జాడ కనుక్కునే డ్యూటీ పడింది..

నేను దాని అడుగులను, రక్తపు చుక్కలను చూసుకుంటూ ఆ బంగాళా దగ్గరికి వచ్చాను. 

అక్కడ చెట్టు మీద ఒక మేక కళేబరం కనిపించింది. చిరుతలు ఆహారాన్ని చెట్టు మీదకు చేర్చుకుని తింటూ ఉంటాయి అని చుట్టూ చూస్తుండగా మీకేక విని ఇటు వచ్చాను, అన్నాడు ఆ వ్యక్తి. 

చెట్టు పైనుండి కింద పడిన మేక నెత్తురు మీకు కనిపించి ఉంటుంది.

“సరే ఈ నీళ్ళతో చేతులు బట్టలు శుభ్రం చేసుకోండి అని నీళ్ళ బాటిల్ ఇచ్చాడు..

కొంచెము ముందుకు కెళ్తే అక్కడ వివేరా అని ఒక ధాబా రెస్టారెంట్ ఉంటుంది.. అక్కడ ఆగి ఏదైనా తిని ఒక గంట రెస్ట్ తీసుకొని వెళ్లండి బాగా అలసిపోయి ఉన్నారు..అని వెళ్లి పోయాడు ఆ వ్యక్తి. 

శ్రీధర్ కార్ తీసుకొని బయలుదేరాడు.

“ఏవండీ నాకు మన బాబు అంకిత్ కనిపించాడు. కార్లో డ్రైవింగ్ సీట్లో కూర్చొని నాతో మాట్లాడుతూ కార్ కొంచెం ముందుకు నడిపి పార్క్ చేశాడు” అని చెప్పింది రమ.

“రమా నీవు బాబు గురించి ఆలోచిస్తూ ఒంటరిగా ఉండటం వల్ల భ్రమ పడి ఉంటావు. వాడికి డ్రైవింగే రాదు..వాడు కారు నడపట మేమిటి? కారు నేను ఎక్కడ పార్క్ చేశానో అక్కడే ఉంది.. ఇంచ్ కూడా జరగలేదు..కంగారు పడకు.. ఒక్కొక్కసారి మనకి బ్రాంతి కూడా నిజమే అనిపిస్తూ ఉంటుంది.. ఇంక అది మర్చిపో” అని వివేరా రెస్టారెంట్ బోర్డు కోసం వెతుక్కుంటూ ముందుకు కదిలాడు శ్రీధర్.

……

వివేరా లో భోజనం చేసి సేద దీరుతున్నారు శ్రీధర్ దంపతులు.. వారు ఆ ఫారెస్ట్ బంగ్లా దగ్గర పట్టపగలు తమకు జరిగిన అనుభవాన్ని ఇంకా మర్చిపోలేక పోతున్నారు.

వీళ్ల మాటలను చూచాయగా వింటూ కస్టమర్లకు సర్వ్ చేస్తున్న ఒక వెయిటరు వీరి వైపుగా వచ్చాడు. 

సార్ ఇందాక నుంచి మీరు ఏదో బంగ్లా అదీ అని అంటున్నారు. ఈ హోటల్ కి పది కిలోమీటర్ల ముందు ఒక పాత ఫారెస్ట్ బంగ్లా ఉంటుంది.అక్కడ మాత్రం ఎప్పుడూ మీరు కారు ఆపొద్దు.

“ఎందుకు” అని ఆత్రుతగా ప్రశ్నించాడు శ్రీధర్.

“ఏం లేదు సార్, ఇరవై ఏళ్ళ క్రితం ఆ ఫారెస్ట్ బంగ్లాలో ఉండే ఫారెస్ట్ గార్డ్ ని ఎవరో టేకు స్మగ్లర్లు చంపేశారట. దాని తర్వాత అది సేఫ్ కాదని ఫారెస్ట్ వాళ్ళు ఆ బంగ్లా ఖాళీ చేసేసారు. 

“కానీ ఆ గార్డ్ కి తన డ్యూటీ అంటే చాలా ప్రాణం” అట.“ఇప్పటికీ చనిపోయినా కూడా అక్కడే డ్యూటీ చేస్తూ ఉంటాడట. రకరకాలుగా పరిస్థితుల్ని సృష్టిస్తూ ప్రయాణీకులకు సహాయం చేయడం లాగా చేస్తూ తను ఫారెస్ట్ డ్యూటీ చేస్తున్నట్టుగా తనలో తను సంతోష పడుతూ ఉంటాడట. పురాతన కాలం నాటి ఖాకీ నిక్కరు, ఖాకీ చొక్కా, నెత్తిన టోపీ. భుజానికి ఒక గన్ తో ఉంటాడట..అతను నిజానికి ఫారెస్ట్ గార్డ్ కాదు.. ఆయన ఆకారం మాత్ర మే”.అని వెయిటర్ చెబుతూ ఉంటే తలతిరిగింది శ్రీధర్ కి..తనకు ముందే కొంత అనుమానం వచ్చింది.. తను వెళ్ళిన బంగ్లా చుట్టూ పిచ్చి మొక్కలే గానీ ఒక్కటి కూడా పెద్ద వృక్షం లేదు.. అందుకే అతను చెప్పిన పులి, మేక కథ తనకు మింగుడు పడ లేదు.. కారు కూడా తను పార్క్ చేసిన ప్లేస్ లో లేదు.. వంద అడుగులు ముందుకు వచ్చి ఉంది…

మనసులో ఏదో సందేహం మెదిలి వెంటనే ట్రిపుల్ ఐటీ హాస్టల్ కి ఫోన్ చేశాడు.

“ఇప్పుడు అంకిత్ ఎలా ఉన్నాడు? మేము ఒక్క గంటలో చేరిపోతాము” అన్నాడు 

“అంకిత్ కి ఏమయింది సార్..మీరెందుకు అంత కంగారు పడుతున్నారు “అన్నాడు హాస్టల్ వ్యక్తి.. 

“అదేమిటి అంకిత్ ఉరి వేసుకుంటే రాత్రి రక్షించి హాస్పిటల్ లో చేర్చామని నిన్న నాకు ఫోన్ చేసారుగా” అన్నాడు శ్రీధర్.

“సార్ మీరేమి మాట్లాడుతున్నారో మాకు అస్సలు అర్థం కావడం లేదు.. “అంకిత్ ఇక్కడ అందరికీ ఫేవరెట్ స్టూడెంట్.. నిన్న ఇంటర్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్ లో బెస్ట్ ప్లేయర్ అవార్డ్ కూడా తీసుకున్నాడు వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్” అన్నాడు ఆ హాస్టల్ మేనేజర్.

“ఏంటండీ బాబు ఎలావున్నాడట” ఆతృత తో అడిగింది రమ . “బాబు సేఫ్ రమా.. డోంట్ వర్రీ” అని చెబుతూ ఫారెస్ట్ గార్డ్ సంగతి సరే వెయిటర్ చెబితే అర్థమైంది..మరి రాత్రి తనకు అంకిత్ గురించి ఫోన్ చేసిందెవరు? 

అని ఆలోచిస్తూ బాసర ట్రిపుల్ ఐటీ వైపుకి కారు పరిగెత్తిస్తున్నాడు శ్రీధర్..

***

బాసర లో అంకిత్ తో ఒక రోజు హ్యాపీ గా గడిపి తిరుగు ప్రయాణం అయ్యారు శ్రీధర్ దంపతులు.

ఎందుకో దారి లో వివేరా హోటల్ వద్ద ఆగి ఆ వెయిటర్ ని పలకరించి పోదాం అని అనిపించి , అది రివర్స్ సైడ్ లో ఉన్నా సరే యూ టర్న్ తీసుకుని హోటల్ లోపలకి వెళ్ళిఏసీ సెక్షన్ లో కూర్చున్నారు.

వెయిటర్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాడు.

“బాబూ సన్నగా పొడుగ్గా ఉన్న మీ ఇంకొక వెయిటర్ ఎక్కడ” అని అడిగాడు.

ఏమోనండీ నేను ఈరోజే చేరాను అని మేనేజర్ ని పిలిచి చెప్పి ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆ వెయిటర్.

వీరు ఆ సన్నటి మనిషి అంటున్నారు 

అతనికి ఒక కన్ను మెల్ల, రెండు పళ్ళు గార పట్టి ముందుకు వచ్చి నట్టుగా ఉన్నాడా” అని అడిగాడు.

అవును, మేము నిన్న వెళ్ళేప్పుడు ఇక్కడ ఆగాము..ఆ పరిస్థితిలో అతను మమ్మల్ని కనిపెట్టి చాలా సహాయం చేశాడు.

అని విషయం మొత్తం ఆ మేనేజర్ కి వివరించి చెప్పాడు శ్రీధర్.

అంతా విని ఆయన తలపట్టుకున్నాడు.. 

వీళ్ళు ఇద్దరూ కలిసి మా హోటల్ ని మూయించేట్టుగా ఉన్నారు.. అని గొణుక్కుంటున్నాడు.

ఏమైంది అలా ఉన్నారు.. అతను లేకపోతే ఫరవాలేదు లే..ఉరికే ఒకసారి మాట్లాడి వెళ్దామని వచ్చాము అని అన్నాడు శ్రీధర్.

అసలు అలాంటి వెయిటర్ మా దగ్గర పని చేసే వాళ్లలో లేరు సార్ . ఇదిగో ఆ ఫారెస్ట్ గార్డు వీడు ఇద్దరూ తోడుదొంగలు. వాడక్కడ బంగ్లా దగ్గర ఉండి ప్రయాణికుల్ని సహాయం చేస్తున్నట్టుగా చేస్తూ చివర్లో ఈ హోటల్ కి వెళ్ళమంటాడు. వీడు ఇక్కడ వాళ్లను కలుసుకొని ఆ గార్డ్ గురించి అతని నమ్మొద్దని

వాడు మనిషి కాదు దయ్యం అని అక్కడ ఎప్పుడూ ఆగవద్దని సలహా చెబుతూ ఉంటాడు.. వీడు వేరే ఎవరికీ కనపడదు. ఆ గార్డ్ పంపిన వారికే వెయిటర్ లాగా కనిపిస్తూ ఉంటాడు.. మేము ఎంత ప్రయత్నించినా మాకు వాడి అంతు చిక్కలేదు.. ఎంతో మంది భూత వైద్యులను పిలిపించాము.. కానీ ఫలితం కొన్ని రోజులే..మళ్ళీ మామూలే 

.వీడికి వాడికి ఇదొక సరదా దయ్యాల ఆట అట..ఇదిగో వాళ్ళ సరదా కోసం మిమ్మల్ని , మమ్మల్ని పీక్క తింటున్నారు .. సార్ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. మా బిజినెస్ పోతుంది సార్ మా కడుపుల మీద కొట్టొద్దు. ఉన్న విషయం చెప్పాను. అది కాక ఎప్పుడన్నా మీ విజిటింగ్ కార్డు గాని, ఇంకా ఏదైనా అడ్రెస్స్ పేపర్ గాని ఈ హోటల్ లో వదిలేసి వెళ్తే ఆ నంబర్లకి ఈ వెయిటరు దయ్యం గాడు వాళ్లకి ఫోన్లు కూడా చేసి ఉన్నదీ లేనిదీ కల్పించి ఏదో మాట్లాడతాడట. అలానే మీకు కూడా ఫోన్ చేసింది వీడే అయి ఉండవచ్చు. సర్లే మీ అబ్బాయి బాగున్నాడు కదా మీరు హ్యాపీగా ఇంటికి వెళ్లిపోండి.. దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు సార్..మా పొట్ట మీద కొట్టొద్దు ప్లీజ్. అని బ్రతిమిలాడి ఆ మేనేజర్ వెళ్ళిపోయాడు.

రమ కి, శ్రీధర్ కి తల తిరిగిపోయింది…

ఈ లోగా ఆర్డర్ చేసిన ఐటమ్స్ తీసుకుని వచ్చిన వెయిటర్ వైపు , ఐటమ్స్ వైపు ఏగా దిగా చూస్తూ ఉండిపోయారు ఇద్దరూ.

*****

తిరుగు ప్రయాణం లో వివేరలో భోజనపర్వం అయిపోయిన తర్వాత తిరిగి హైదరాబాద్ వైపు బయలుదేరుతూ ఆ ఫారెస్ట్ బంగ్లా రాగానే ఎందుకో చిన్న డౌటు వచ్చింది శ్రీధర్ కి. రమా పదా అసలు ఆ బంగ్లాలో అసలు ఏముంది? చూద్దాం 

.మరి నాకు కనిపించిన రక్తపు మరకలన్నా ఉండాలి కదా? చుట్టూ చిన్న వైన, పెద్ద చెట్లైనా ఉండాలి కదా ?ఆ ఫారెస్ట్ గార్డు అనే వాడు నిజమా అబద్దమా? అని తెలుసుకుందాం పద.. నువ్వు ఒక్కదానివి కారులో ఉండ వద్దు. ఇద్దరం కలిసే వెళ్లి తేల్చుకుందాం పద. అని కార్ లాక్ చేసి ఇద్దరు బంగ్లా వైపు వెళ్లసాగారు .

చిన్నగా అడుగులేస్తూ పిచ్చి చెట్లను తప్పుకుంటూ ఆ బంగ్లా వైపు వెళుతూ చుట్టూ చూశారు. ఎక్కడా పెద్ద చెట్ల లాటివి ఏమీ కనిపించలేదు. అక్కడక్కడ పిచ్చి మొక్కలు తప్ప. దారి చూసుకుంటూ లోపలికి వెళ్లారు. లోపల పుచ్చిపోయి ఊగుతున్న తలుపులు. తూట్లు పడ్డ మొండి గోడలు. అంతే ఇంకేమీ కనిపించలేదు. ఎక్కడా రక్తం పడిన ఆనవాళ్లు కానీ , రక్తం ఇంకిన గుర్తులు కానీ వాళ్ళకి కనిపించలేదు. అప్పుడు అర్థమైంది. ఇవన్నీ సృష్టించ బడ్డవే, నిజమైన వి కాదు అని . మన ఫారెస్ట్ గార్డు ఎందుకు ఇక్కడే తిరుగుతున్నాడు .అతనికి సంబంధించి ఏమైనా గుర్తులు ఇక్కడ ఉన్నవేమో అనుకుంటూ ఇల్లు మొత్తం చూశారు. వెనక యార్డ్ లో కి వెళ్తే ఒక మూలన ఒక కంకాలం, ఒక పుర్రె కనిపించాయి. అప్పుడు వాళ్ళకి అనిపించింది. ఈయన బందిపోటుల తో పోరాడి చనిపోయిన తర్వాత చివరి కర్మ కాండలు ఎవరూ చేయలేదు అనుకుంటా.

 అందుకని పాపం ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు. అనుకున్నారు.  

వెంటనే తమకు తెలిసిన పురోహితుని ఫోను లో పిలిపించి అప్పటివరకూ దానిని కాపలా కాస్తూ, శవ జాగరణ చేసి, ఆ కంకాలాన్ని జాగ్రత్తగా ఒక చోటకు చేర్చి, శాస్త్రార్థకంగా వారే దగ్గరుండి కర్మ కాండలు అన్నీ శాస్త్రం ప్రకారం దగ్గరుండి జరిపించాడు శ్రీధర్ . అంతా అయిపోయిన తర్వాత ఆయన పిండాలకు నమస్కారం చేసి, నాయనా ఇన్ని రోజులు ఈ అడవిలో డ్యూటీ లు చేసావు..ఇకనైనా పుణ్యలోకాలకు చేరుకో . ఇంక నుండి ఆ పై లోకాల్లో హాయిగా ఉండు. అని నమస్కరించాడు శ్రీధర్. ఒకసారి ఆకాశంలో పెద్ద వెలుగు… చూస్తే ఆ గార్డు శ్రీధర్ ని ప్రేమతో ఆశీ ర్వదిస్తూ , రెండు చేతులతో నమస్కరిస్తూ, ఆకాశంలో నుంచి పై పైకి వెళ్తున్నట్టు.. లీలగా కనిపించాడు. 


ఒక మంచి పని చేశామని సంతృప్తితో హైదరాబాద్ కి కారు లో

 బయలు దేరారు శ్రీధర్ దంపతులు…


అయిపోయింది..

Comments

Popular posts from this blog

బెదురు

ఉగాది ప్రసాదం

ఒక నువ్వు ఒక నేను