అపార్ట్మెంట్ లైఫ్
కథ. అపార్ట్మెంట్ జీవితాలు
ఎప్పుడు అసోసియేషన్ మీటింగ్ కి పిలిచినా మన నలుగురం మాత్రమే ఉంటున్నాము. మిగిలిన ఓనర్స్ ఎవరూ రావడం లేదు..
అన్నాడు అసోసియేషన్ సెక్రటరీ శంకర్.
అవును. బిల్డింగు బాగా పాతబడి పోయింది. పైన టెర్రెస్ లోనూ సైడ్ గోడల లోనూ క్రాక్స్ వచ్చాయి. సగం మంది మెంబర్స్ అయినా రాక పోతే ఎవరితో మాట్లాడతాం అన్నాడు కృష్ణ..
మా వంట ఇంట్లో గోడల నిండా నీరు సీపేజ్ అవుతుంది.. లోపల ఎన్నిసార్లు రిపేర్ చేసినా మళ్లీ మళ్లీ తడిసి పెచ్చులూడి పోతున్నాయి, అన్నాడు శంకర్…
బాల్కనీ ల లో ఇనుప గ్రిల్స్ తుప్పు బట్టి పోతున్నాయి అన్నాడు రామారావు.
సరే అని అందుబాటులో ఉన్న కొంతమంది మెంబర్స్ కి ఫోన్ చేశారు.
వారు పాజిటివ్ గా నే స్పందించారు.
పెయింట్స్ కంపెనీ పోర్టల్ లో “విజిట్ కాల్” బుక్ చేసి ఖర్చు ఎస్టిమేట్ తీసుకుని, పది లక్షలు ఖర్చు అవుతుంది,తలకో ఇరవై వేలు ఇవ్వ వలసినది గా గ్రూప్ లో సభ్యులను కోరాడు శంకర్ .
ఒక రెండు వారాల తరువాత
ఒకాయన రిప్లై పెట్టాడు,
“నాకు తెలిసి పది లక్షలు చాలా ఎక్కువ.ఐదు లక్షలకే చేసేవాళ్ళు వస్తారు” అని.
“అవును పది లక్షలు చాలా ఎక్కువ,అంత ఇవ్వలేము” అని ఇంకొక నలుగురు వంత పాడారు.
“ఇంకో ఇద్దరి దగ్గర కొటేషన్ తీసుకోండి
మాడబ్బులు మీరు వేస్ట్ చేయట్లేదని ఏమిటి గారంటీ? “ అని ఒకాయన ప్రశ్న..
ఇంక తనకు తప్పదు అనుకుని చచ్చి చెడి ఇంకొక ముగ్గురు ఏజెన్సీ ల దగ్గర కొటేషన్స్ తీసుకొని షేర్ చేశాడు శంకర్.
చూస్తే అన్నిటికంటే ముందు తీసుకున్న కొటేషనే తక్కువగా ఉంది.
సరే మీరు పన్లు మొదలు పెట్టండి మేము మూడు విడతలుగా ఇస్తాము అని కొంతమంది , రెండు వాయిదా లుగా ఇస్తాము అని కొంతమంది అనగా, ఒక నలుగురు మాత్రం వెంటనే మనీ ట్రాన్స్ఫర్ చేశారు. మంచి బాలురు కూడా ఉంటారుగా ..
ఇంక మిగతా ఫండ్స్ కోసం తరచూ రిక్వెస్ట్ మెసేజ్ లు పెడుతూనే ఉన్నాడు శంకర్ ..
ఒకాయన మా అమ్మ కి క్యాన్సర్ అన్నాడు. ఇంకొక ఆయన మా పిల్లలకు ఫీజులు కట్టాలి అన్నాడు .
ఇలా ఒక్కొక్కరి ప్రాబ్లం వింటూ ఉంటే ఈ పని కొలిక్కి వచ్చేట్టు కనపడలేదు శంకర్ కి.
అలా రెండు నెలలు గడిచిపోయాయి ఈలోగా ముందు డబ్బులు ఇచ్చిన వాళ్లు ఇంకా పని మొదలవలేదని సతాయించడం మొదలుపెట్టారు.
తన ఇంట్లో రోజు రోజు కీ పాడవు తున్న గోడలను చూస్తూ నిద్ర పట్టని రాత్రులు గడుపుతున్నాడు శంకర్.
ఇది మన స్వంత పని కాదు.. దీనికి నలుగురూకలిసిరావాలి. ఇది ఇప్పట్లో కుదిరేట్టుగా లేదు. అన్నది శంకర్ భార్య
…
శంకర్ రా కూర్చో.. ఏమిటి ఇలా వచ్చావు అడిగాడు గోపాల్. మా
పీఎఫ్ ఆఫీసుకి వెళ్ళి వస్తున్నా, కొత్త ఇల్లు కట్టుకోవాలని అప్లై చేసుకుంటే పీఎఫ్ అమౌంట్ మొత్తం తీసుకొన వచ్చు అన్నారు..
అయితే కొంత బ్యాంక్ లోన్ కూడా అవసరం ఔతుంది..అందుకని మీ బ్యాంకు తో పని పడింది. అన్నాడు శంకర్..
ఏమైంది, ఇప్పుడున్న ఇల్లు నీ స్వంత మేగా అడిగాడు గోపాల్. తన ఇబ్బందులన్నీ ఏకరువు పెట్టాడు శంకర్.
అవును శంకర్..నేను ఇలానే బాధలు పడి పడీ ఆరు నెలలక్రితం రాంపల్లి దగ్గర ఇండిపెండెంట్ ఇల్లు కొనుక్కుని మారిపోయా.
ఆఫీస్ కి దూరం అని ఒక్కటే గాని మనసు ఇప్పుడు ప్రశాంతం గా ఉంది.
నా భార్య కి ఒక ఎలక్ట్రికల్ బైక్ కొనిపెట్టా ..తను బైక్ పై రోజూ పిల్లలను స్కూల్ కు దింపుతోంది.
మా పక్కన ఇంకా రెండు పోర్షన్లు కడుతున్నారు.. ఆ బిల్డర్ స్థలం పేపర్ల కాపీలు అన్నీ నాదగ్గర ఉన్నాయి.. దిగులు పడకు నీ హోమ్ లోను నేను ప్రాసెస్ చేసి పెడతా….
అనగానే ఒక్కసారిగా మనసులోని భారం తీరిపోయి, అప్పుడే తను కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం అవుతున్నట్టుగా ఊహించుకుంటూ , తన భార్య తో శుభ వార్త పంచుకుందామని మొబైల్ బయటకు తీశాడు శంకర్..
రచన: శ్రీనివాస శాస్త్రి.
Comments
Post a Comment