సెల్లో పాఖ్యానం

 కథ: సంక్రాంతి సెలవులు..


సంక్రాంతి కి స్వంత ఊరికి వెళ్ళడానికి మూడునెల్లముందు నుండీ టిక్కెట్లు బుక్ చేసుకుని, ఆఫీసు లో బాస్ ని అతికష్టం మీద ఒప్పించి కుటుంబతో సహా ఊరికి ప్రయాణమయ్యాడు జయరాం.


రైల్వే స్టేషన్ లో జనాన్ని తోసుకుంటూ, పిల్లలతో సహా అందరూ తలా ఒక లగేజీ మోసుకుంటూ బోగీ వెతుక్కుని ఎక్కేసరికి తలప్రాణం తోకొచ్చింది…


రైలు ఇప్పుడే సిటీ దాటి నట్టుంది ,వేగం అందుకుంది .


ఇంక రెస్ట్ తీసుకుందామని బెర్త్ మీద నడుం వాల్చి మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు జయరాం..


“ప్రయాణం లో అయినా మాతో కాసేపు సరదాగా మాట్లాడొచు కదా.. ఎప్పుడూ ఆ మొబైల్ తోనే గడపకపోతే, పిల్లలకు కూడా ఏమి తోచడం లేదు”.. అంది రమ.


“రమా, నేను ఫోన్ చూస్తున్నది కాలక్షేపానికి కాదు, కరెంట్ బిల్లు దగ్గరనుండి క్రెడిట్ కార్డు బిల్లుల వరకు ఫ్లైట్ టికెట్స్ నుండి బస్ టికెట్స్, ఓలా రైడ్లు, ఆటో బుకింగ్లు, చివరికి ఆఫీసు మెయిల్స్, అన్నీ ఇప్పుడు ఫోన్ యాప్ ల ద్వారానే కదా, ఈరోజున మన చేతిలో మొబైల్ ఫోన్ లేకపోతే ఏమీ చేయలేని పరిస్థితి, మొబైల్ లేకపోతే ఏదో శరీరం లో పార్ట్ లేనట్టుగా ఉంటుంది..ఏమీ తోచదు”అన్నాడు జయరాం.

 

“అవును వీటితోపాటు యూ ట్యూబ్ రీల్స్, వాట్సాప్, FB, insta కూడా వాటితో కలిసే ఉంటాయి లెండి” దెప్పింది రమ.


రమ అన్నది నిజమే.. యూ ట్యూబ్ లో న్యూస్ కోసం ఓపెన్ చేస్తే దానంతట అదే “రీల్స్” లోకి వెళ్తుంది..అవి ఒక దాని తరువాత ఒకటి మారుతూ ఉండడం, మనకు తెలియ కుండా సమయం గడచి పోవడం.. అదొక వ్యసనం లాగా అయిపోయింది.. అని ఆలో చూస్తున్నాడు జయరాం..


“సరే మనం బంధువులతో సరదాగా గడుపుదామని, ఎన్నోరోజులుగా అనుకుంటూ ఉంటే, ఇప్పటికీ వీలుకుదిరింది.

“ మీరు ఈ పండుగ మూడు రోజులు అక్కడ మొబైల్ చూడనని మాటివ్వండి”.. అన్నది రమ..

అవును రమ కరెక్ట్ చెప్పింది అనుకోని 

తను “ఔట్ ఆఫ్ ఆఫీస్ మేసేజ్ , ఆల్టర్నేట్ కాంటాక్ట్స్ కూడా ఆఫీసు మెయిల్ లో పెట్టే వచ్చాడు..కనుక ఆఫీసు కాల్స్ కూడా రావు..అనుకుని

 

“సరే రమా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను..ఈ మూడురోజులు మనం పాత ప్రపంచం లోకి వెళ్ళి ఆనందంగా గడుపుదాం”..అన్నాడు జయరాం..


అనుకున్న విధంగానే రైల్వే స్టేషన్ లో దిగి తమ ఊరికి వెళ్లి బంధుమిత్రులతో చిన్ననాటి స్నేహితులతో చాలా సరదాగా గడిపారు జయరాం, రమ .


తమ ఇద్దరి పిల్లలకు చిన్నప్పుడు తిరిగిన పొలాలు పంట పొలాలు కాలవ గట్లు అన్ని చూపించి అక్కడ తెలిసిన వారిని పలకరించుకుంటూ తమ పిల్లల్ని పరిచయం చేస్తూ సరదాగా పండగ మూడు రోజులు గడిపేశారు.

 

 సెలవులు అయిపోయినాయి వెళ్లే రోజు వచ్చేసింది .


ఈ మూడు రోజులు ఫోన్ గురించి గుర్తే రాలేదు. రమ చెప్పిన మాట విని మొబైల్ ఆఫ్ చేసి పెట్టడం చాలా మంచిది అయింది , అని జయరాం అనుకుంటే 

“సంక్రాంతి సెలవులను ఫుల్ గా ఎంజాయ్ చేశాం , మ్యాఫ్రెండ్స్ అందరికీ మేము ఎన్నో విషయాలు చెప్పాలి” అనుకుంటున్నారు పిల్లలు.

అలా రాత్రి రైలు ఎక్కి ఉదయాన్నే సిటీలో తమ ఇంటికి చేరారు జయరాం కుటుంబం..

 

పొద్దున్నే ఆఫీసుకు బయలుదేరుతూ మొబైల్ ఫోన్ ఆన్ చేసుకున్నాడు జయరాం .


చాలా మెసేజ్లు లోడ్ అవుతున్నాయి.

వరుసగా కొన్ని మెసేజ్లు క్రెడిట్ కార్డు యూసేజ్ గురించి ఉన్నాయి.

 ఏదో ఫారిన్ లో ఆన్లైన్ షాపింగ్ లో యూఎస్ డాలర్స్ లో షాపింగ్ చేసినట్టుగా వరుస మెసేజ్లు ఒక ఎనిమిది దాకా ఉన్నాయి. వీళ్లెవరో మొత్తం లాగేసారు అనుకుంటూ 

బ్యాంకు కస్టమర్ హెల్ప్ లైన్ నంబర్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు జయరాం.


మూడురోజులు ఫోను ఆఫ్ ఉండడం వల్ల కొంచెం లేటుగా ఫోన్ చేస్తున్నానని చెప్పాడు.


అందుకు వాళ్లు “మీరు షాపింగ్ మెసేజ్ రాగానే చూసుకుని బ్లాక్ చేసుకోవాలి సర్..

ఇంత లేటుగా చేస్తున్నారు, ఈ పేమెంట్స్ ఏమి రిటర్న్ రావండి. మీ కంప్లైంట్ లాగ్ చేసి విచారిస్తాము” అని పెట్టేశారు .


తాము ఊరికి వెళ్లే ముందు ఇల్లు తాళం వేసి వెళ్తున్నామని కొంచెం చూస్తూ ఉండమని చుట్టుపక్కల వారిని రిక్వెస్ట్ చేసి వెళ్ళాము.. ఇంట్లో ఏమీ జరగకుండా చూసుకొందామని అనుకున్నాం, కానీ, ఇలా క్రెడిట్ కార్డు అకౌంట్లో ఆన్లైన్ ఫ్రాడ్ జరుగుతుందని, ఇలా డబ్బు నష్టపోతామని అనుకొనే లేదు అని బాధ పడ్డారు రమా జయరాం…


వారం ఎదురు చూసిన తరువాత ఒక కాల్ వచ్చింది.. సారాంశం ఏమిటంటే 

“లక్కీగా మీకు జరిగిన ఆ మూడు రోజుల్లోనే ఇలాంటి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ చాలామందికి జరిగాయి, బ్యాంకు సర్వర్ లో AI soft ware ఉండడం వల్ల, దీనిని పసిగట్టి చాలా వరకు డబ్బులు మర్చంట్ అకౌంటు కు వెళ్లకుండా సస్పెన్స్ అకౌంట్ లో పార్క్ చేసింది 

అందువల్ల మీలాగే చాలామందికి డబ్బు లు సేవ్ అయ్యాయి.. మీరు గడువు లోగా బ్లాక్ చేయక పోవడం మీ మిస్టేక్, అయినా స్పెషల్ కేసు గా భావించి వీటిని రిఫండ్ చేస్తున్నాము. ఒక 80వేల దాకా రిటర్న్ వస్తాయి.. కానీ అప్పటికే ట్రాన్స్ఫర్ అయిన 20వేల దాకా మాత్రం మేమేమీ చేయలేము సారీ” అని చెప్పారు .


గుడిలో మెల్ల అనుకున్నాడు జయరాం..

రోజు లేవగానే తను ఫోన్ లో, వాట్సాప్ లో మెసేజ్లు చూసుకోవటం రమ “పొద్దున్నే లేస్తూనే మొదలు పెట్టారా” అనడం నాకూ ఆమెకీ మామూలే . 

అయితే మూడు రోజులు మొబైల్ ఆఫ్ చేయడం వల్ల మెసేజ్ లు చూసుకోకపోవడం వల్ల ఈ నష్టం జరిగింది..

 “మొబైల్ ఫోన్ తరచూ చూస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడకపోతే కూడా ఇంకెన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి” అనుకున్నాడు జయరాం 

కొంత డబ్బు రిటర్న్ వచ్చిన good news విషయం రమకి చెప్పి, ఇక తనను మొబైల్ విషయం లో ఎప్పుడూ దెప్ప వద్దని చెప్పాలి అనుకుంటూ ,

“రమా ఒకసారి ఇటు రా” అని పిలిచాడు 

జయరాం..


రచన: శ్రీనివాస శాస్త్రి.

 






Comments

Popular posts from this blog

బెదురు

ఉగాది ప్రసాదం

ఒక నువ్వు ఒక నేను